హైదరాబాద్:
భారతీయ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కుతున్న అత్యంత భారీ చిత్రం ‘రామాయణ’ (Ramayana) గురించి దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో సీతమ్మ పాత్రలో నటిస్తున్న క్రేజీ హీరోయిన్ సాయిపల్లవి (Sai Pallavi), తన పాత్ర అనుభవాన్ని పంచుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు.
‘అమ్మా.. నువ్వే చేయించుకో’ అని ప్రార్థించా: సాయిపల్లవి
సినిమా ప్రచారంలో భాగంగా నటుడు రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor), సాయిపల్లవి కలిసి ప్రసిద్ధ రియాలిటీ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి 18’ (KBC 18) కార్యక్రమానికి అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హోస్ట్ అమితాబ్ బచ్చన్ ‘రామాయణ’లో సీతమ్మగా నటించే అవకాశం రావడం ఎలా అనిపించిందని ప్రశ్నించగా సాయిపల్లవి స్పందించారు.
"సాధారణంగా నేను ఏ సినిమాలో నటించినా ఆ పాత్రకు నావంతుగా ఏం చేయగలనని ఆలోచిస్తాను. కానీ సీతమ్మ పాత్ర విషయంలో మాత్రం అలా చేయలేకపోయాను. ఈ పాత్ర ద్వారా నేను ఎంత జ్ఞానాన్ని సొంతం చేసుకోగలననే విషయాన్ని మాత్రమే చూశాను. నాకు తెలిసిన విషయాలను కూడా పక్కనపెట్టి.. ‘అమ్మా.. నాతో ఈ పాత్రను నువ్వే చేయించుకో’ అని సీతమ్మను వేడుకుని సెట్స్‌లోకి అడుగుపెట్టాను" అని సాయిపల్లవి వివరించారు. సాయిపల్లవి చెప్పిన విధానం చూసి బిగ్ బి అమితాబ్ బచ్చన్ "చాలా బాగా చెప్పారు" అంటూ ఆమెను ఎంతగానో అభినందించారు.
రెండు భాగాలుగా ‘రామాయణ’.. విడుదల తేదీ ఇదే!
దర్శకుడు నితేశ్ తివారీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా నటిస్తున్నారు. అలాగే ప్రముఖ నటుడు యశ్ (Yash) రావణుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా, సన్నీ దేవోల్ హనుమంతుడి పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ పౌరాణిక చిత్రాన్ని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి తొలి భాగం (Ramayana Part 1) 2026 నవంబరు 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
